సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): వందేమాతరం గేయంలోని ప్రతి పదం దేశభక్తి భావనతో భారతదేశం ఒకటే అని చెబుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. జాతీయ గీతాన్ని మహాకవి బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సామూహిక గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులతో కలిసి సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వందేమాతరం గేయంలోని ప్రతి పదం దేశభక్తి భావనతో నిండి, భారతదేశం ఒకటే అని గర్వంగా చెబుతుందని, ఈ గీతం మన దేశ ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని, ప్రతి విద్యార్థి ఈ భావనను మనసులో నిలుపుకోవాలని సూచించారు. అలాగే ప్రతిరోజూ పాఠశాలలో వందేమాతరం గేయాన్ని ఆలపించడం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యత భావాలు మరింత బలపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు ఈ గీతం ద్వారా దేశసేవా స్పూర్తిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. వందేమాతరం గేయం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని, దేశ చరిత్రలో ఈ గేయం విశేష ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు .
వందేమాతరం గేయంలోని ప్రతి పదం దేశభక్తి భావనతో భారతదేశం ఒకటే అని చెబుతుంది: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Published On: November 7, 2025 12:01 pm