ఎల్లారెడ్డిలో వరద నష్టం పరిశీలించిన కేంద్ర బృందం – పంట, మౌలిక వసతుల నష్టం వివరాలు సేకరణ

IMG 20251008 WA0415 1170x780 1

ఎల్లారెడ్డి,అక్టోబర్ 8, (ప్రశ్న ఆయుధం):

కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు మరియు మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, నష్టపరిస్థితులను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం బుధవారం జిల్లాకు చేరుకుంది.

హోమ్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ పీకే రాయ్ నేతృత్వంలో మహేష్ కుమార్ (డిప్యూటీ డైరెక్టర్, ఎక్స్పెండిచర్స్ – సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్), శ్రీనివాసు బైరి (మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి), శశి వర్ధన్ రెడ్డి (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ – ఇస్రో, హైదరాబాద్) సభ్యులుగా ఉన్న బృందం మొదట బిక్నూర్ మండల కేంద్రానికి చేరుకోగా, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్వాగతం పలికారు.

తదనంతరం కేంద్ర బృందం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించింది. లింగంపేట మండలంలోని లింగంపల్లి కుర్ధు బ్రిడ్జి, ఎల్లారెడ్డి మండలంలోని అడ్విలింగాల వద్ద గల ఆర్‌అండ్‌బీ బ్రిడ్జి , నాగిరెడ్డిపేట మండలంలోని మంజీరా ముంపు ప్రభావిత పంట పొలాలు, అలాగే పోచారం ప్రాజెక్టు సమీపంలో మట్టి కొట్టుకుపోయిన ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు.

ఇక ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని పెద్ద చెరువు కింద పంట పొలాలు, నాగిరెడ్డిపేట మండలంలోని చినూరువాడి గ్రామం సమీపంలో నేషనల్ హైవే 765 డీ పక్కన ఉన్న వరి పొలాలను కూడా పరిశీలించారు. అనంతరం పోచారం డ్యామ్ వద్ద నష్టపరిస్థితులను సమీక్షించి సాంకేతిక వివరాలు సేకరించారు.

ఈ పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డీవో పారసింహారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ ఈఈ మోహన్, వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, అలాగే విద్యుత్, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.

పంట నష్టం, రహదారి మరియు వంతెనల ధ్వంసం, మౌలిక వసతుల పునరుద్ధరణ అవసరాలపై సమగ్ర వివరాలు సేకరించిన కేంద్ర బృందం, నివేదికను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపింది.

వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు తక్షణ సాయాన్ని అందించాలని స్థానికులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment