సంగారెడ్డి/జోగిపేట, అక్టోబర్ 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): జోగిపేట అభివృద్ధి అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని 17వ వార్డు మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నేషనల్ హైవే రోడ్డును జోగిపేట మీదుగా కాకుండా సంగుపేట వద్ద బైపాస్గా ఏర్పాటు చేయడం బీఆర్ఎస్ హయాంలో జరిగిందని, దీని వల్ల పట్టణ వ్యాపారాలకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. హైవే కాంట్రాక్టర్ వద్ద కమిషన్లు తీసుకోవడమే ఆ నిర్ణయానికి కారణమా కాదా.. అని ప్రశ్నించారు. అలాగే జోగిపేట అభివృద్ధి కోసం అజ్జమర్రి బ్రిడ్జి నిర్మాణానికి రూ.80 కోట్లు మంజూరు చేయించినా, పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. శంకుస్థాపన శిలాఫలకం వద్ద నుంచి మంజీరా నది వరకు మట్టి రోడ్డు నిర్మాణం పూర్తయిందని, చూడాలనుకుంటే వచ్చి పరిశీలించాలని బీఆర్ఎస్ నాయకులను సవాల్ చేశారు. మాజీ జడ్పిటిసి నారాయణ మాసానిపల్లి గ్రామంలో బీటీ రోడ్డు వేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రతిపాదనలు మాత్రమే పెట్టిందని, తామే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామని చెప్పారు. అలాగే మాజీ జడ్పీ చైర్మన్ జైపాల్ రెడ్డి సతీమణి స్వగ్రామం దాఖరులో ఎన్ని రోడ్లు వేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రూపాయలు 43 కోట్లతో ఆందోళ వద్ద నర్సింగ్ కళాశాల మంజూరు చేయించిన ఘనత మంత్రి దామోదర్ రాజనర్సింహదేనని చిట్టిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మమ్మద్ నజీర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
జోగిపేట అభివృద్ధిపై చర్చకు కాంగ్రెస్ సిద్ధం: మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు
Published On: October 10, 2025 5:48 am