సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లాలో నిర్వహించబోయే గ్రామ పంచాయతీల రెండవ విడత సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబాతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని, ప్రతి ఓటు విలువైనదని పేర్కొంటూ ఓటరు జాబితాలు సక్రమంగా సిద్ధం కావడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఓటరు జాబితాలపై వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని నిష్పాక్షికంగా పరిశీలించి, తక్షణమే పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల రెండవ విడత ఎన్నికలు విజయవంతంగా, శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించుటకు జిల్లా యంత్రాగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా జరిగే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకరించాలని అన్నారు. ముఖ్యంగా పోలింగ్ స్టేషన్స్, డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లికేషన్, అలాగే గ్రామ పంచాయట్స్ డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టరల్ రోల్స్, వార్డు – వైస్ ఎలక్టరల్ లిస్ట్స్ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఒక కుటుంబంలోని అన్ని ఓట్లు ఒకే వార్డులో పొందుపరచే విధముగా సూచనలు జారీ చేశారు. ప్రచురితమైన ఓటరు జాబితాలలో ఎటువంటి లోపాలు, పొరపాట్లు, అభ్యంతరాలు ఉన్నచో సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఈ నెల 28నుండి 30వరకు తెలియజేయవలసినదిగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. మండల స్థాయిలో సమస్య పరిష్కారం కానిచో జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, సంగారెడ్డి గారికి అప్పీలు చేయవచ్చునని అన్నారు. ఆ అప్పీలు 31న విచారణకు తీసుకొని తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పాషా, బిఆర్ఎస్ తారా సింగ్, బిజెపి, మాణిక్ రావు, సిపిఎం. అడివయ్య, సిపిఐ కృష్ణ, ఎంఐఎం. యాకూబ్ అలీ, టిడిపి బదయ్య, బీఎస్పీ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరగాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Published On: August 29, 2025 6:42 pm