అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలకు అందించే పౌష్టికాహార పంపిణీని పర్యవేక్షించేందుకు అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలు, ఆహార పంపిణీ వంటి అంశాలు నమోదు అవుతాయి.
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా చేతుల మీదుగా నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ, పౌష్టికాహార పంపిణీలో పారదర్శకతను పెంచడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. టీచర్ల పనితీరును సులభతరం చేయడానికి ఈ స్మార్ట్ ఫోన్లు దోహదపడతాయని పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గర్భిణీలు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పద్మ, సిడిపిఓ సౌందర్య, బీజేపీ కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.












