భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించి, సాధారణ ప్రసవాలను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు జరిగిన జూమ్ సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు.
జిల్లాలో అత్యధికంగా జరుగుతున్న సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించి, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని డీఎంహెచ్ఓ సూచించారు. ఇందుకోసం ప్రతి ఆరోగ్య కేంద్రంలో 'నార్మల్ డెలివరీ మోటివేషన్ గ్రూపులు' ఏర్పాటు చేసి, గర్భిణీలకు ఆరోగ్య విద్య, యోగాసనాలు నేర్పించాలని ఆదేశించారు.
వైద్య సిబ్బంది సెలవుల విషయంలో నిబంధనలు కఠినతరం చేశారు. మూడు రోజులకు మించిన సెలవులకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని, నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రోజువారీ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.
గర్భిణీ స్త్రీలకు ఏఎన్సీ క్లినిక్లలో మెరుగైన సేవలు అందించడంతో పాటు, రక్తహీనత నివారణ, బాలల ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రారంభ దశలోనే గర్భాన్ని గుర్తించి, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఔషధాల నిల్వలను సక్రమంగా నిర్వహించాలని, అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. రికార్డుల నిర్వహణను ఎప్పటికప్పుడు నవీకరించాలని, జూన్ 1 నుంచి ఉద్యోగుల జీతాలను ఏబీఏఎస్ హాజరు ఆధారంగా ఇవ్వాలని, దీనికి జిల్లా వైద్య అధికారి అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.











