హనుమకొండలోని ములుగు రోడ్డులో గల హాజర హాస్పిటల్ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బంధువు మృతి చెందాడని ఆరోపిస్తూ, మృతుడి మృతదేహాన్ని ఆసుపత్రి లోపల ఉంచి రోగుల బంధువులు ఆందోళనకు దిగారు.
పరకాల పట్టణానికి చెందిన రాజ్ పేట గ్రామానికి చెందిన తోట రవి అనే వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. మృతుడి బంధువులు ఆసుపత్రి యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రవి మరణించాడని వారు ఆరోపిస్తున్నారు.
ఈ సంఘటనతో ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
మృతుడి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.










