కామారెడ్డి జిల్లాలో 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ గర్భద్వార క్యాన్సర్ నివారణకు ఉద్దేశించిన హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) టీకా కార్యక్రమం ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ టీకా పంపిణీ జరగనుంది.
కామారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు HPV టీకా కార్యక్రమం అమలు చేయబడుతోంది. ఈ కార్యక్రమం మార్చి 8, 2026న ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి కామారెడ్డి మరియు ఏరియా ఆసుపత్రి బాన్సువాడలో ప్రారంభించబడుతుంది.
హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వల్ల కలిగే గర్భాశయ గర్భద్వార క్యాన్సర్ నివారణ లక్ష్యంగా ఈ టీకా కార్యక్రమం చేపట్టారు. భారత ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ టీకా సురక్షితమైనదని, శాస్త్రీయంగా నిరూపితమైనదని అధికారులు తెలిపారు.
14 సంవత్సరాలు నిండి, 15 సంవత్సరాలు పూర్తి కాని బాలికలకు ఒక్క డోస్ HPV టీకా ఇవ్వబడుతుంది. టీకాలు ప్రతిరోజు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు సంబంధిత ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉంటాయి. బాలికలు తండ్రి లేదా సంరక్షకుడితో వచ్చి, వయస్సు నిర్ధారణ పత్రం, మొబైల్ ఫోన్ తీసుకురావాలి. ఖాళీ కడుపుతో రాకూడదని సూచించారు.
ప్రస్తుతం కామారెడ్డి, బాన్సువాడ ఆసుపత్రులలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఇతర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విస్తరించనుంది. అర్హులైన బాలికలకు టీకాలు వేయించాలని జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సూచించారు.


