మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అమలు చేస్తున్న ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కీసర సర్కిల్, దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని ఎంఎల్ఆర్ కాలనీలో దోమల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వసంత పాల్గొన్నారు.
ఎంటమాలజీ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని అధికారులు కాలనీవాసులకు సూచించారు. ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ముఖ్యంగా కుండలు, టైర్లు, నీటి ట్యాంకులలో జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.
దోమల లార్వా నియంత్రణ కోసం మల్కారం చెరువులో గంబూజా చేపలను విడుదల చేశారు. అలాగే, కాలనీలోని పలు వీధుల్లో యాంటీ లార్వల్ ఆపరేషన్ నిర్వహించి, నిల్వ నీటిలో మందులను పిచికారీ చేశారు.
“ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ 99 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి,” అని డిప్యూటీ కమిషనర్ వసంత తెలిపారు.







