ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజల్లో సురక్షిత ఆహారపు అలవాట్లు, పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 'ఈట్ రైట్ వాక్' కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సోమవారం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి. రవి రాథోడ్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వాక్, ఆహార భద్రతా ప్రమాణాల అమలు పట్ల చైతన్యం కల్పించే లక్ష్యంతో జరిగింది.
కళాకారుల బృందం ఆరోగ్య భద్రతపై పాటలు పాడుతూ, డప్పు చప్పుళ్లతో జిల్లా కోర్టు నుండి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వరకు సాగిన ఈ వాక్, ప్రజలను ఆకట్టుకుంది. ఆహార భద్రత నిబంధనల అమలు బలోపేతం చేయడం, ఆహార ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించడం, సురక్షితమైన, శుభ్రమైన, పోషకాహారపు అలవాట్లను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యాలు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ, శుభ్రమైన ఆహారం తీసుకోవడం, ఆహార పదార్థాల నిల్వ, వంటలో పరిశుభ్రత పాటించడం, కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలను వాడకూడదని సూచించారు. పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, లైసెన్సు కలిగిన, పరిశుభ్రమైన ఆహార కేంద్రాల నుంచే ఆహారం కొనుగోలు చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ధర్మేంద్ర మాట్లాడుతూ, 'ఈట్ రైట్' వంటి కార్యక్రమాలు ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో, సురక్షిత ఆహార సంస్కృతిని నెలకొల్పడంలో కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వైద్యులు, విద్యార్థులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.











