రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో అసంపూర్తిగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీ.హెచ్.సీ) నిర్మాణ పనులను పూర్తి చేయడానికి రూ.1.69 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఈ నిధులు మంజూరు కావడంతో దశాబ్ద కాలంగా నిలిచిపోయిన నిర్మాణం పూర్తి దిశగా అడుగులు పడనున్నాయి.
ముదిగుబ్బ పీ.హెచ్.సీ భవన నిర్మాణంలో మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.1.69 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 2016లో రూ.1.18 కోట్లతో నిర్మాణం మంజూరు కాగా, రూ.87.93 లక్షలకు పరిపాలన అనుమతులు లభించాయి. పనులు ప్రారంభమైనా, కేవలం రూ.27 లక్షల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి.
అనంతరం వచ్చిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయని మంత్రి కార్యాలయం పేర్కొంది. అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రజల విజ్ఞప్తులను పట్టించుకోలేదని, ప్రజారోగ్యాన్ని విస్మరించారని ఆరోపించింది.
ఎన్నికల సమయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ముదిగుబ్బ పీ.హెచ్.సీ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం, ఆయన వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ అదనంగా రూ.1.09 కోట్ల నిధులను మంజూరు చేయించారు. దీంతో ప్రస్తుత అంచనాల ప్రకారం మొత్తం రూ.1.69 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో కూడిన పీ.హెచ్.సీ నిర్మాణం జరగనుంది.
ఈ నిధులు 15వ ఆర్థిక సంఘం ఆరోగ్య గ్రాంట్లలో భాగంగా విడుదలయ్యాయి. నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ద్వారా నిధుల విడుదలకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMSIDC)కు పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్మాణం పూర్తయితే ముదిగుబ్బ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.











