రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని 638 వైద్యుల పోస్టుల భర్తీ ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు తొలిసారిగా ఆన్లైన్ కౌన్సెలింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ఈ ప్రక్రియ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు 34 గంటల్లోపే పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయబడతాయి.
ప్రజారోగ్య శాఖ (డీహెచ్) ద్వారా మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) పోస్టులకు ఎంపికైన వారికి ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయబడతాయి. ఏపీ ఆన్లైన్ సహకారంతో ఈ కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లకు అనుగుణంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం 611 పోస్టులకు పోస్టింగ్ ఉత్తర్వులు ఆటోమేటిగ్గా ఆన్లైన్ ద్వారానే జారీ అవుతాయి.
గతంలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు, నిర్వహణాపరంగా ఇబ్బందులు ఎదురయ్యేవని, ఈ నేపథ్యంలో అభ్యర్థులకు అనుకూలంగా, మరింత పారదర్శకంగా ఉండేలా ఆన్లైన్ కౌన్సెలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. ఆసుపత్రుల వారీగా ప్రకటించిన పోస్టులన్నింటికీ అభ్యర్థులు ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, ఇందులో ఎలాంటి పరిమితులు లేవని ఆయన సూచించారు.
మొత్తం 638 పోస్టులకు గాను, 124 ట్యూటర్ల పోస్టులు కాగా, మిగిలిన 611 పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతుంది. వెరిఫికేషన్ చేయాల్సి ఉన్న స్పోర్ట్స్ కోటా పోస్టులు మినహాయించి, మిగిలిన వాటికి సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు (31 గంటలు) అభ్యర్థుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తారు. అనంతరం రెండు, మూడు గంటల్లో అభ్యర్థుల మెయిల్స్‌కు పోస్టింగ్ ఉత్తర్వులు ఆటోమేటిగ్గా చేరుతాయి. పోస్టింగ్ ఉత్తర్వులు పొందినవారు 15 రోజుల్లోగా సంబంధిత కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అక్కడే జరుగుతుందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి తెలిపారు.










