ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో స్పెషలిస్ట్ వైద్యులతో నిర్వహిస్తున్న శిబిరాలను ఆమె పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి, వివిధ విభాగాల పనితీరును, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. రోగులకు ఇబ్బందులు లేకుండా ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్లను పెంచాలని, ఇంటర్నెట్ వేగాన్ని మెరుగుపరచాలని సూపరింటెండెంట్‌కు ఆదేశించారు.
ఆసుపత్రిలోని ఓపీ విభాగాలు, సర్జికల్, మెడికల్ ఓపీలు, ఫార్మసీ, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, క్రిటికల్ కేర్ విభాగాలను పరిశీలించి రికార్డుల నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆర్బీఎస్కే నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు.
విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, రక్తహీనత, కంటి, చెవి, దంత సమస్యలు, పోషకాహార లోపాల నిర్ధారణ, చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మార్క్స్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి, స్పెషలిస్ట్ వైద్యులతో నిర్వహిస్తున్న శిబిరాన్ని పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణపై సూచనలు చేశారు.
జిల్లాలో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, డీసీహెచ్ఎస్ కవిత, డాక్టర్ శశాంక్ తదితర వైద్యాధికారులు పాల్గొన్నారు.











