ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న డిజిటల్ హెల్త్ కార్డుల నమోదు కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు, జిల్లా వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన ఆరోగ్య సేవలు అందించడంలో డిజిటల్ హెల్త్ కార్డులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి అర్హుడికి హెల్త్ ఐడి నమోదు జరిగేలా అధికారులు కృషి చేయాలని ఆమె సూచించారు.
డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ అమలుపై అవగాహన, అవసరమైన సిబ్బంది, పరికరాలు, ప్రాథమిక నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా జనరల్ ఆసుపత్రిలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని వైద్యాధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
నమోదు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు తగిన సిబ్బంది నియామకం, సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, ఓపీ కేంద్రాలను సిద్ధం చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆమె తెలియజేశారు.











