సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.కె.లలితాదేవి సూచించారు. సోమవారం ఆమె జోగిపేట్ ఏరియా ఆసుపత్రితో పాటు తాలేల్మ, నేరేడిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆరోగ్య సిబ్బంది విధులకు సమయానికి హాజరవుతున్నారా.. లేదా అనే అంశాన్ని అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వివిధ విభాగాలను సందర్శించి పరిశీలించారు.
ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న మందుల నిల్వలను తనిఖీ చేసిన డీఎంహెచ్వో, గడువు ముగిసిన మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ ఉంచరాదని ఆదేశించారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా, సకాలంలో అందించాలని సూచించారు.
వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆమె, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆమె పేర్కొన్నారు.












