ప్రజల ప్రాణాలను కాపాడుతూ సమాజానికి అమూల్యమైన సేవలు అందిస్తున్న వైద్యుల పాత్ర అత్యంత గొప్పదని, అన్ని వృత్తుల్లో వైద్య వృత్తి అత్యున్నతమైనదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆయన జిల్లా వైద్యాధికారులను ఘనంగా సన్మానించారు.
జాతీయ వైద్యుల దినోత్సవం (డాక్టర్స్ డే) సందర్భంగా బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశంలో ప్రతి ఏడాది జూలై 01న ప్రముఖ వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి, వర్ధంతి సందర్భంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. వైద్యులు తమ జ్ఞానం, నైపుణ్యం, సేవాభావంతో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
రోగుల పట్ల మానవత్వం, సహానుభూతితో వ్యవహరిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి, డీసీహెచ్ఎస్ఓ గోపాల్, వివిధ విభాగాల వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.












