అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు: టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి

*త్వరలో హైదరాబాదులో ఆత్మీయ సమ్మేళనం*

సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇంటి స్థలాలను అందించడం లక్ష్యంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సంఘం (టీయూడబ్ల్యూజే- ఐజేయూ) కృషి చేస్తుందని సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంతో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు విరాహత్ అలీ తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అనేకమార్లు చర్చించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు. తమ సంఘం పోరాటం ఫలితంగానే గతంలో చాలా మందికి అక్రిడేషన్ కార్డులు వచ్చాయని, బస్సు పాస్ లు కూడా లభించాయని, హెల్త్ కార్డు వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కూడా దక్కాయని వివరించారు. ఇంకా మరి కొంత మంది మిగిలిపోయారని, వారందరికీ కూడా ఇంటి స్థలాలు అందించడమే లక్ష్యంగా తమ యూనియన్ పట్టు వదలకుండా పని చేస్తుందని వెల్లడించారు. దీనిలో భాగంగానే అప్లికేషన్ ఫామ్ ను బుధవారం సంగారెడ్డిలోని ఐబీలో విడుదల చేయడం జరుగుతుందని యాదగిరి పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ ఫామ్ ద్వారా అర్హులైన జర్నలిస్టులు అందరి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఆ వివరాలను రాష్ట్ర యూనియన్ కు అందజేస్తామని, తద్వారా అర్హులందరికీ ఎక్కడికక్కడే ఇంటి స్థలాలను త్వరలో మంజూరు చేయించడం జరుగుతుందని వివరించారు. సంగారెడ్డి ఐబీలో బుధవారం ఉదయం 10:30 గంటలకు అప్లికేషన్ ఫామ్ విడుదల కార్యక్రమం ఉంటుందన్నారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కె.ఫైజల్, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో త్వరలో పెద్ద ఎత్తున వర్కింగ్ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం హైదరాబాదులో జరుగుతుందని తెలిపారు. ఆ సమ్మేళనంలో పాల్గొనేందుకు సంగారెడ్డి జిల్లాలోని ప్రతి మండలము, పట్టణం నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులను తరలి రావాల్సిందిగా యాదగిరి కోరారు. ఎక్కడికక్కడే స్థానిక నాయకులు సమన్వయం చేసుకుంటూ జర్నలిస్టులను ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున తరలించడం జరుగుతుందన్నారు. భారీ ఎత్తున సమ్మేళనం నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి జర్నలిస్టుల సమస్యలను సమగ్రంగా వివరించే అవకాశం దక్కుతుందని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి జర్నలిస్టు పాల్గొనడం ద్వారా సంగారెడ్డి జిల్లాను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. హైదరాబాదులో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో హౌసింగ్ పాలసీతో పాటు హెల్త్ కార్డుల ప్రక్రియను కూడా ప్రకటిస్తారని యాదగిరి వివరించారు.

Join WhatsApp

Join Now