*నూతన చట్టాల గురించి అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలి:*
ఐ.జీ. వి.సత్యనారాయణ*
*డైల్-100 కాల్స్ కు త్వరితగతిన స్పందించాలి*
*సంగారెడ్డి జిల్లా పోలీసుల పని తీరు బేష్*
*నిషేదిత గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ అమ్మకాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ఉక్కు పాదం*
*•మట్కా, పేకాట వంటివి జిల్లాలో ఉండటానికి వీలులేదు*
*జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించిన మల్టీ జోన్-2 ఐ.జీ.*
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): నూతన చట్టాల గురించి అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని, డైల్-100 కాల్స్ కు త్వరితగతిన స్పందించాలని, సంగారెడ్డి జిల్లా పోలీసుల పని తీరు బేష్ అని ఐ.జీ. వి.సత్యనారాయణ అన్నారు. శనివారం మల్టీ జోన్-2 ఐ.జీ వి.సత్యనారాయణ సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయ ఆవరణ, పోలీసు పరేడ్ గ్రౌండ్ పరిశీలించారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ నూతనంగా ప్రారంభించిన సైబర్ ల్యాబ్, పోలీసు క్యాంటీన్, వాటర్ ప్లాంట్ గురించి, జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల నేరాలు, రోడ్డు ప్రమాదాల నిర్వరణకు తీసుకున్నటువంటి చర్యల గురించి ఐ.జీకి వివరించారు. అనంతరం ఐ.జీ సత్యనారాయణ పోలీసు అధికారులతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉండటం వలన పొరుగు రాష్ట్రాల నుండి ఎక్కువ అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఉన్నందున వాహనాల తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని, జిల్లా గుండా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. జిల్లాలో మట్కా, గంజాయి, పేకాట వంటి నిషేధిత ఆటలు ఆడడానికి వెలులేదని, ఎవరైనా మట్కా నిర్వహిస్తున్నట్లు గాని, గంజాయి పండించినా, అక్రమ రవాణా చేస్తున్నట్లుగాని, మట్కా, పేకాట ఆడుతున్నట్లు గాని గుర్తించినట్లయితే అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని యస్.హెచ్.ఓ లకు సూచించారు. జిల్లాలో ఎవరైనా పై చర్యలకు పాల్పడితే సంబంధిత అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడనని అన్నారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, అల్మాస్ లైట్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా బ్లింకింగ్ లైట్స్ ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. అనుక్షణం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్-100 కాల్స్ విషయంలో బ్లూ కోర్ట్ సిబ్బంది త్వరితగతిన స్పందించాలని, అతి తక్కువ కాల వ్యవధిలో నేర స్థలాన్ని చేరుకున్నట్లైతే నేరం యొక్క గ్రావిటీని తగ్గించవచ్చు అని, నేరం జరగకుండా ఆపవచ్చని అన్నారు. అధికారులు, సిబ్బంది పోలీసు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, సత్: ప్రవర్తనతో ఉండాలని సూచించారు. ఫిర్యాది సమస్యను ఓపికగా విని, వారి సమస్య పరిష్కారం దిశగా సూచనలు చేయాలన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐ.జీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 356 మందిపై హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగిందని, గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలకు ఏర్పాటు చేసిన ఎస్-నబ్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో మహిళల రక్షణ కొరకు చేపట్టిన మై ఆటో సేఫ్ కార్యక్రమం మంచి కార్యక్రమం అని, పరిశ్రమల రక్షణ, ఉద్యోగుల రక్షనార్ధమై ( సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ రూపేష్ చేస్తున్న కృషి, జిల్లా యంత్రాంగం పని తీరు వలన రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా ముందు వరుసలో నిలిచిందని, సంగారెడ్డి జిల్లా పోలీసుల పని తీరు బేష్ అన్నారు. జిల్లా ప్రజల శాంతి భధ్రతలకు విఘాతం కలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిసి నేరాలకు పాల్పడినట్లైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ గా పరిగణించి, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల సమాచారం తెలిసినట్లైతే ఎస్-నబ్ నెంబర్: 8712656777 కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ. సంజీవ రావు, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, జహీరాబాద్ డీఎస్పీ రామ్ మోహన్ రెడ్డి, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి మరియు జిల్లా ఇన్స్ పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.