అంతర్జాతీయ జలాల్లో ఉద్రిక్తతలను పెంచుతూ, అమెరికా ఇరాన్ ఓడరేవులపై పూర్తిస్థాయి సైనిక దిగ్బంధనాన్ని ప్రకటించింది. అరేబియా గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని అన్ని ఇరాన్ పోర్టుల నుంచి నౌకల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ మిలిటరీ కమాండ్ (సెంట్ కామ్) వెల్లడించింది.
ఈ భారీ ఆపరేషన్‌లో 10,000 మందికి పైగా అమెరికా సైనికులు, నావికులు, మెరైన్లు, వైమానిక దళ సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ మిషన్ కోసం డజనుకు పైగా యుద్ధనౌకలు, వందకు పైగా యుద్ధ, నిఘా విమానాలను మోహరించారు. అత్యాధునిక యుద్ధనౌకలతో పాటు ఫైటర్ జెట్లు, డ్రోన్లు, ఇంధనం నింపే విమానాలు నిరంతరం గగనతలం నుంచి పహారా కాస్తున్నాయి.
దిగ్బంధనం ప్రారంభమైన తొలి 24 గంటల్లోనే దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇరాన్ ఓడరేవుల నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆరు వాణిజ్య నౌకలను అమెరికా బలగాలు నిలిపివేసి, తిరిగి ఇరాన్‌లోని గల్ఫ్ ఆఫ్ ఒమన్ పోర్టులోకి ప్రవేశించేలా ఆదేశించినట్లు సమాచారం. ఏ దేశానికి చెందిన నౌక అయినా ఇరాన్ పోర్టులకు వస్తే లేదా అక్కడి నుంచి బయలుదేరితే నిలిపివేస్తామని అమెరికా స్పష్టం చేసింది.
అయితే, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే ఇతర దేశాల నౌకల స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం ఉండదని అమెరికా హామీ ఇచ్చింది. కేవలం ఇరాన్ పోర్టులకు వెళ్లే లేదా వచ్చే నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, మిగిలిన రవాణా యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. ఈ పరిణామం అంతర్జాతీయ జలాల్లో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.











