నర్సాపూర్, అక్టోబర్ 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): సృష్టికి మూలమైన ఆడబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలని లోక్ సత్తా పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి మిర్యాల చంద్రశేఖర్ గుప్తా పిలుపునిచ్చారు. శనివారం అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి ఆడపిల్లల పాత్ర అత్యంత కీలకమని, దుర్గా శక్తితో సమానమైన బాలికలను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని అన్నారు. ఇంటికి దీపం ఆడపిల్ల, సమాజానికి వెలుగు ఆడపిల్ల అని పేర్కొంటూ, బాలికలపై వివక్షత, హింస, బాల్య వివాహాలు, బ్రుణహత్యలు వంటి సామాజిక దుష్ప్రవర్తనలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఆడపిల్లలను చదువించి, స్వావలంబిగా తీర్చిదిద్దితేనే సమాజం ముందుకు సాగుతుందని చెప్పారు. మహిళల సాధికారతకు అందరూ చేయూతనిస్తేనే సమానత్వ సమాజం సాధ్యమవుతుందని, ఇంటి నుండి సమాజం వరకు ఆడపిల్లకు గౌరవం దక్కే వాతావరణం ఏర్పరచాలని కోరారు. బాలికలకు అంతర్జాతీయ బాలిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, “ఆడబిడ్డను ఆదరించండి – అదే మన సంస్కృతి ప్రతిబింబం” అని మిర్యాల చంద్రశేఖర్ తెలిపారు.
బాలికలను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత: లోక్ సత్తా పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి మిర్యాల చంద్రశేఖర్ గుప్తా
Published On: October 11, 2025 8:32 pm