*శాంతి భద్రతల పరిరక్షణ మా భాద్యత, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక చొరవ చూపాలి:*
*డీజీపీ డా.జితేందర్*
*గంజాయి సాగు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ఉక్కు పాదం మోపాలి*
*మట్కా, పేకాట ఆనవాళ్ళు జిల్లాలో ఉండటానికి వీలులేదు*
*అలవాటు పడిన నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలి*
*డైల్-100 కాల్స్ కు త్వరితగతిన స్పందించాలి:*
*జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి డా. జితేందర్*
*సంగారెడ్డి జిల్లా పోలీసుల పని తీరు బాగుందన్న తెలంగాణ డీజీపీ*
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): శాంతి భద్రతల పరిరక్షణ మా భాద్యత, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక చొరవ చూపాలని, గంజాయి సాగు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ఉక్కు పాదం మోపాలని, మట్కా, పేకాట ఆనవాళ్ళు జిల్లాలో ఉండటానికి వీలులేదని, డైల్-100 కాల్స్ కు త్వరితగతిన స్పందించాలని డీజీపీ డా.జితేందర్ అన్నారు.మంగళవారం నాడు గౌరవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి డా.జితేందర్ సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మల్టీ జోన్-2 ఐ.జి వి.సత్యనారాయణతో కలిసి మొక్కలు నాటారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ సెక్షన్ లను, నూతనంగా ప్రారంభించిన సైబర్ ల్యాబ్, కాన్ఫరెన్స్ హాల్ లను చూపించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన క్రైమ్ రివ్యూ సమావేశంలో ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. డీపీఓ కార్యాలయాన్ని ఆధునీకరించిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపుతూ.. జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల నేరాలు, రోడ్డు ప్రమాదాలు, వాటి నివారణకు తీసుకున్న చర్యలు, జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటు చేసిన ఎస్-నబ్ గురించి డిజిపికి వివరించారు. అనంతరం డిజిపి డా.జితేందర్ పోలీసు అధికారులు ఒక్కొక్కరితో మాట్లాడుతూ.. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాలు, హిస్టరీ షీటర్స్, శాంతి భద్రతల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉండటం వలన పొరుగు రాష్ట్రాల నుండి ఎక్కువ అక్రమ రవాణా జరగటానికి అవకాశం ఉన్నందున వాహనాల తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని, జిల్లా ద్వారా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. వాహనాల తనిఖీలలో భాగంగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. నేరస్తులకు కోర్టులో శిక్ష పడినప్పుడే, నేరస్తులు తిరిగి నేరం చేయడానికి భయపడతారని, అదేవిధంగా ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం రోడ్డు ఇంజనీరింగ్ లో లోపాలు ఉన్నట్లయితే ఆర్అండ్ బీ అధికారులతో మాట్లాడి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని సత్సంబంధాలు కలిగినప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని డిజిపి గుర్తు చేశారు. జిల్లాలో మట్కా, పేకాట వంటి నిషేధిత ఆటలు ఆడడానికి వీలులేదని, ఎవరైనా మట్కా నిర్వహిస్తున్నట్లు గాని, గంజాయి సాగు, అక్రమ రవాణా చేస్తున్నట్లుగాని, మట్కా, పేకాట ఆడుతున్నట్లు గాని గుర్తించినట్లయితే అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని యస్.హెచ్.ఓలకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పత్యేక చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు, బ్లింకింగ్ లైట్స్, బోలార్డ్స్ ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. అనుక్షణం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా డయల్-100 కాల్స్ విషయంలో బ్లూకోర్ట్ సిబ్బంది త్వరితగతిన స్పందించాలని, అతి తక్కువ కాల వ్యవధిలో నేర స్థలాన్ని చేరుకున్నట్లైతే నేరం యొక్క గ్రావిటీని తగ్గించవచ్చు అని, నేరం జరగకుండ ఆపవచ్చు అన్నారు. అధికారులు సిబ్బంది పోలీసు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, సత్: ప్రవర్తనతో ఉండాలని సూచించారు. ఫిర్యాదు సమస్యను ఓపికగా విని, వారి సమస్య పరిష్కారం దిశగా సూచనలు చేయాలని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిజిపి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యల గురించి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభినందించారు. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలకు ఏర్పాటు చేసిన ఎస్-నబ్ అభినందనీయమని, దీని ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో మహిళల రక్షణ కొరకు చేపట్టిన మై ఆటో సేఫ్ కార్యక్రమం మంచి కార్యక్రమం అని, పరిశ్రమల రక్షణ, ఉద్యోగుల రక్షనార్ధమై ఎస్ఎస్ఎస్ సీ(సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ గారు చేస్తున్న కృషి, సంగారెడ్డి జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరును డిజిపి అభినందించారు. అనంతరం ఉత్తమ పని తీరును కనబరిచిన రామ్ మోహన్ డియస్పి, ఇన్స్పెక్టర్ శివలింగం, ఇన్స్పెక్టర్ మల్లేశం, ఇన్స్పెక్టర్ రమేష్, ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, శ్రీకాంత్ ఎస్.ఐ, ఆసిఫ్ ఎస్.ఐ, హెడ్ కానిస్టేబుల్, ప్రభాకర్ జానకిరామ్, ఆర్.ఐ. హన్మిరెడ్డి ఆర్.ఐ. రాజశేఖర్ రెడ్డి ఎ.ఒ. కళ్యాణి సూపర్డెంట్ వెంకటేశం, విజయ్ పవార్ సిసిలకు డిజిపి రివార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో మల్టీ జోన్-2 ఐ.జి వి.సత్యనారాయణ, అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, సంగారెడ్డి డియస్పి సత్యయ్య గౌడ్, పటాన్ చెర్వు డియస్పి రవీందర్ రెడ్డి, జహీరాబాద్ డియస్పి రామ్ మోహన్ రెడ్డి, నారాయణఖేడ్ డియస్పి వెంకట్ రెడ్డి మరియు జిల్లా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐ.లు తదితరులు పాల్గొన్నారు.