సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి అంబేద్కర్ గ్రౌండ్‌లో శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జిల్లా క్రీడాభిమానులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్‌రావు, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ క్రీడా దినోత్సవాన్ని జెండా ఊపి, హాకీ పోటీలను ప్రారంభించారు. జాతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ క్రీడా వేడుకలకు మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై హాకీ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. అన్ని రంగాలలో ఆడ పిల్లలను ప్రోత్సహించాలని, విద్యార్థులకు పుస్తకాలతో పాటు క్రీడలు కూడా సమానంగా అవసరం అని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావాలని, విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులు, రంగాలు ఎంచుకునే స్వేచ్ఛ కల్పించాలని సూచించారు. సౌండ్ మైండ్, ఇన్ సౌండ్ బాడీ అని ప్రాచీన తత్వవేత్తలు చెప్పిన వాక్యం ప్రాముఖ్యతను వివరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను వారి ప్రతిభ ప్రకారం సరైన రంగాలలో రాణించేలా దారి చూపాలని పిలుపు నిచ్చారు. అలాగే ఆయన నికిత్ జారిన్, పూర్ణ వంటి విజయవంతమైన క్రీడాకారులను ప్రస్తావిస్తూ, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పెద్ద హోదాలో ఉన్న చాలా మంది ప్రభుత్వ పాఠశాలల నుండే చదివారని గుర్తు చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడానికి కృషి చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఫుట్‌బాల్, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి ఐదు క్రీడలను జిల్లాలో మరింత అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 21వ తేదీ నుండి టీంల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని తెలిపారు. రాబోయే డిసెంబర్ 25వ తేదీ (అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి) నాటికి జాతీయ స్థాయి క్రీడల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ.. నేషనల్ స్పోర్ట్స్ డే ఉద్దేశం ప్రతి విద్యార్థి జీవితంలో క్రీడలను ఒక భాగంగా చేసుకోవాలని అన్నారు. క్రమశిక్షణ, మానసిక ఎదుగుదల, స్పోర్ట్స్ స్పిరిట్ అభివృద్ధికి, క్రీడలు బలమైన పునాది వేస్తాయని అన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. సానుకూల దృక్పథం విద్యా విజయానికి మూలాధారమని వివరించారు. అభ్యాసం, ఉద్యోగం, క్రీడలు – అన్ని రంగాల్లో ఆడపిల్లలు సమాన అవకాశాలు పొందాలని పిలుపునిచ్చారు. కేల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి స్టేడియం అభివృద్ధికి ఎంపీ సహకారంతో దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలల్లో పీఈటీలు, హెచ్ఎంలు సమన్వయంతో క్రీడా సామగ్రిని సద్వినియోగం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్, జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి ఖాసీం భేగ్, ఒలింపిక్స్ అసోసియేషన్ సెక్రటరీ చంద్రశేఖర్, బాక్సింగ్ అసిస్టెంట్ హనుమంత్ గౌడ్, వాలీబాల్ అసిస్టెంట్-కృష్ణ, మచ్చేందర్, ఖో-ఖో-హరికృష్ణ, హాకీ -రాహుల్, సాయి కుమార్, టేక్వాండో-వాసు, కరాటే-వాసు, టీజీ పేట-సుభాష్, పేట టీఎస్- గౌసుద్దీన్, రగ్బీ-కిష్టయ్య, ఉపాధ్యాయులు, పిఈటిలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అన్ని రంగాలలో ఆడ పిల్లలను ప్రోత్సహించాలి: పార్లమెంటు సభ్యుడు రఘునందన్‌రావు
Published On: August 29, 2025 5:57 pm