సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): పోలీసులను వారి కుటుంబాలను కాపాడుకోవడం మన బాధ్యత అని, ప్రభుత్వం సమాజ బాధ్యతతో ప్రజల ఆరోగ్యం, విద్య, వైద్యంకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నాని రాష్ట్ర వైద్య, అరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహా అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీస్, ఐఎంఏ, ఎన్ఎంజే కాన్సర్ ఇన్స్టిట్యూట్ – హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లోని పీఎస్ఆర్ గార్డెన్ లో జిల్లా పోలీసు కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన కంప్రెహేన్సివ్ హెల్త్ క్యాంపును మంత్రి దామోదర్ రాజనరసింహా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. పోలీసు కుటుంబాల కోసం హెల్త్ క్యాంపును నిర్వహించటం చక్కని ఆలోచన అన్నారు. 13 రకాల వైద్య నిపుణులైన డాక్టర్లు ఈ హెల్త్ క్యాంపులో పాల్గొంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతాల వరకు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. సామాన్యుడికి భారం కాకుండా అందరికీ అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి రోజు డయాలసిస్ రోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో 160 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు కు మరో 80 కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి వెల్లడించారు త్వరలో 80 ట్రామా సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైవేలపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి గోల్డెన్ అవర్ ను దృష్టిలో పెట్టుకొని అక్కడ ట్రామా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ ను ఏర్పాటు చేసి కీమో థెరపీ అందిస్తున్నామని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజీ, 500 బేడెడ్ ప్రభుత్వ ఆసుపత్రి, అందోల్ లో నర్సింగ్ కాలేజీ, సంగారెడ్డిలో పారామెడికల్ కాలేజీ, క్రిటికల్ కేర్ బ్లాక్, 5 న్యూ పీహెచ్ సీలను, 3 న్యూ పీహెచ్ సీ బిల్డింగ్ లను ప్రారంభించామన్నారు. జిల్లాలో వట్ పల్లిలో సీహెచ్ సీ, తెల్లాపూర్ లో సీపీహెచ్ సీ లను ఏర్పాటు చేశామన్నారు. పఠాన్ చెరువు, నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రులలో, సీహెచ్ సీ సదాశివపేటలో డయాలిసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు మరో 3 సబ్ హెల్త్ సెంటర్స్ లను మంజూరు చేశామన్నారు. ఈ సందర్బంగా హెల్త్ క్యాంపులో ఏర్పాటు చేసిన అన్ని విభాగాలను పరిశీలించారు. కియోస్క్ ద్వారా మంత్రి బీపీ చెక్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, జిల్లా వైద్యాధికారి నాగనిర్మల, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జి. అంజయ్య,ప్రముఖ వైద్యులు డా కిరణ్ కుమార్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డా.రాజుగౌడ్, సెక్రటరీ డా.ఆనంద్, డా.శ్రీధర్, డా.శ్రీహరిలు, జిల్లా పోలీస్ అధికారులు, వారి కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.
పోలీసుల ఆరోగ్యం మన బాధ్యత: మంత్రి దామోదర్ రాజనరసింహా
Published On: October 22, 2025 2:47 pm