సంగారెడ్డిలో ప్రజా ప్రసార వ్యవస్థను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లా ప్రజలను అప్రమత్తం చేయడానికి జిల్లా పోలీసు శాఖ ఆద్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని ఐబీ పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ప్రజా ప్రసార వ్యవస్థ (పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్)ను ఏర్పాటు చేసి, గురువారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, టీజీఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. ఈ ప్రజా ప్రసార వ్యవస్థ ద్వారా మన చుట్టూ జరుగుతున్న వివిధ రకాల ఆన్లైన్ మోసాలు, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు సేఫ్టీ వంటి విషయాలపై జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుందని అన్నారు. అధునిక సాంకేతికతతో కూడిన ప్రజా ప్రసార వ్యవస్థ (పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్) ఉదయం, సాయత్రం ప్రజలు రద్దీగా ఉండే సమయంలో వివిధ రకాల ఆన్లైన్ మోసాలు, రోడ్డు సేఫ్టీ వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ.. ప్రజలను చైతన్యం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలను చైతన్య పరచాలని జిల్లా పోలీసు యంత్రాంగం చేపటిన ఈ ప్రజా ప్రసార వ్యవస్థ (పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్) ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజలు ఈ ప్రజా ప్రసార వ్యవస్థ నుండి అవగాహన పొంది వివిధ రకాల ఆన్లైన్ మోసాలు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ.. సైబర్ నేరాల నుండి రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందాలని జిల్లా ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీస్పి సత్యయ్య గౌడ్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ రామకృష్ణ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, రూరల్ ఇన్స్పెక్టర్ క్రాంతి, ఎస్ఐ రవీందర్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment