ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభాలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు, ఇంధన రంగంలో ఏర్పడిన అనిశ్చితి నేపథ్యంలో భారత్ ఏమాత్రం బెదిరిపోదని, అంతర్జాతీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా దేశానికి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆదివారం జరిగిన 132వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మందికి పైగా భారతీయుల భద్రత పట్ల తన ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు.
ప్రజలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యాప్తి చేసే వదంతులను నమ్మవద్దని, కేవలం ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు.
దేశీయంగా ఇంధన భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇంధన రంగంలో వినియోగదారులపై భారం తగ్గించే ఉద్దేశ్యంతో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేస్తున్నామని, ఇది ఇంధన భద్రతకు దోహదపడుతుందని మోదీ పేర్కొన్నారు.










