దేశ ప్రజలకు ఊరటనిచ్చేలా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచే ప్రధాన మంత్రి చర్యలు ప్రశంసనీయమని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజల క్షేమాన్ని నిరంతరం కోరుకునే నాయకుడని, క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా నిలుస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం దేశ ప్రజలపై పడకుండా, పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ఇంధన భారం నుంచి ఉపశమనం కల్పించారని ఆయన తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ, ప్రధాన మంత్రి తన దౌత్య నీతితో భారతదేశంపై దాని ప్రభావాన్ని తగ్గించేందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంధన కొరత రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూనే, ప్రజలపై భారం పడకుండా తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఆయన అభివర్ణించారు.
పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 10 తగ్గించడం, డీజిల్ పై ఉన్న సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం వంటి నిర్ణయాలు దేశ ప్రజలతో పాటు చమురు సంస్థలకు కూడా ఊరటనిస్తాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉప ముఖ్యమంత్రి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధన భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే ఈ నిర్ణయం ప్రజల మన్ననలను పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.







