మెదక్/నర్సాపూర్, జనవరి 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కలిసి మండల సర్పంచుల ఫోరం ఏర్పాటు చేశామని చెప్పడం పూర్తిగా అవాస్తవమని శివ్వంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నవీన్ గుప్తా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చండి గ్రామంలోని ఒక ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సమావేశాన్ని మండల సర్పంచుల ఫోరంగా ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. శివ్వంపేట మండలంలో మొత్తం 37 గ్రామ పంచాయతీలు ఉండగా, టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సమావేశానికి కేవలం 17 మంది సర్పంచులు మాత్రమే హాజరయ్యారని తెలిపారు. అలాంటి సమావేశాన్ని మండల సర్పంచుల ఫోరంగా పరిగణించలేమని, అది కేవలం టీఆర్ఎస్ పార్టీ మండల యూనియన్‌గా మాత్రమే చూడాలన్నారు. గత జనవరి 4న గోమారం గ్రామంలో 20 మంది సర్పంచులు హాజరై, వారి సంతకాలతో అధికారికంగా శివ్వంపేట మండల సర్పంచుల ఫోరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ సమావేశంలో దంతాలపల్లి, కొంతంపల్లి, దొంతి, గొల్లపల్లి, పోతులగూడ, పాముబండ, భీమ్లా తాండ, సికింద్లాపూర్, రత్తాపూర్, పిల్లుట్ల, తాళ్లపల్లి తండా, శభాష్‌పల్లి, గంగయ్యపల్లి, అల్లిపూర్, గోమారం, రెడ్యా తండా, రూపుల తండా, మల్లుపల్లి తండా తదితర గ్రామాల సర్పంచులు పాల్గొని మద్దతు తెలిపారని అన్నారు. ఈ సమావేశంలో పిల్లుట్ల గ్రామానికి చెందిన బుర్ర మురళి గౌడ్‌ను ఏకగ్రీవంగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అలాగే పెద్ద గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ మోకాళ్ల నవీన్ అనివార్య కారణాలతో సమావేశానికి హాజరు కాలేకపోయినా, కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటూ బుర్ర మురళి గౌడ్‌కు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు తెలియజేశారని పేర్కొన్నారు. కావున జనవరి 4న గోమారం గ్రామంలో 20మంది సర్పంచులు కలిసి తీసుకున్న నిర్ణయం మేరకు బుర్ర మురళి గౌడ్ అధ్యక్షతన ఏర్పడిన శివ్వంపేట మండల సర్పంచుల ఫోరాన్ని అధికారికంగా గుర్తించాలని సంబంధిత అధికారులను కోరుతున్నట్లు నవీన్ గుప్తా తెలిపారు.
కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన మండల సర్పంచుల ఫోరాన్ని గుర్తించాలి: శివ్వంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నవీన్ గుప్తా
Published On: January 6, 2026 9:33 pm