గత ఏడాదిన్నర కాలంలో 763 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా డీజీపీ ఎదుట లొంగిపోయారు.
శుక్రవారం లొంగిపోయిన మావోయిస్టులలో బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేశాలు కూడా ఉన్నారని డీజీపీ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో పోలీసుల కూంబింగ్ కార్యకలాపాలు పెరగడంతో, పలువురు మావోయిస్టులు తెలంగాణ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.
లొంగిపోయిన వారిలో కేవలం ఒక్కరు మాత్రమే తెలంగాణకు చెందినవారు కాగా, ఎక్కువమంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని డీజీపీ వివరించారు. వీరిలో బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేశాలు కూడా ఉన్నట్లు తెలిపారు.
లొంగిపోయిన వారికి పునరావాస ప్యాకేజీ కింద రూ.1.93 కోట్లు అందజేస్తున్నామని, సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్యకార్డులు కూడా అందిస్తామని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. గతంలో సెంట్రల్ కమిటీలో 11 మంది, స్టేట్ కమిటీలో 24 మంది తెలంగాణ వాళ్లు ఉండేవారని, ఇప్పుడు వారి సంఖ్య ఇద్దరికి తగ్గిందని ఆయన పేర్కొన్నారు.
మిగిలిన మావోయిస్టులు కూడా అజ్ఞాతవాసాన్ని వీడి పోలీసుల ముందు లొంగిపోవాలని డీజీపీ పిలుపునిచ్చారు. చట్టానికి లోబడి వారికి పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.











