ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) క్యాంప్‌బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేశారు. సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న కీలక తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ప్రముఖ న్యూస్ అవుట్లెట్ ‘మింట్’ను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది.
కొత్త సీఈవో నియామకం జరిగేంత వరకు విల్సన్ తన బాధ్యతల్లో కొనసాగుతారని సమాచారం. గత వారం జరిగిన బోర్డు సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదించినట్లు తెలిసింది. కొత్త సీఈవో నియామకం పూర్తయ్యే వరకు, అవసరమైతే సెప్టెంబర్ వరకు కూడా ఆయన పదవిలో ఉండే అవకాశం ఉంది.
టాటా గ్రూప్ యాజమాన్యంలోకి ఎయిర్ ఇండియా వచ్చిన తర్వాత 2022 సెప్టెంబర్‌లో విల్సన్ బాధ్యతలు స్వీకరించారు. తన కాంట్రాక్ట్ గడువుకు మించి కొనసాగేందుకు ఆయన ఆసక్తి చూపకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త సీఈవో కోసం అన్వేషణ ఇప్పటికే చివరి దశలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం ఎయిర్ ఇండియా తీవ్రమైన నిర్వహణ ఒత్తిళ్లు, పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా విమానాలను దారి మళ్లించాల్సి వస్తుండటంతో నిర్వహణ వ్యయం భారీగా పెరిగింది. మరోవైపు, కొత్త విమానాల డెలివరీలో జాప్యం జరగడం విస్తరణ ప్రణాళికలకు ఆటంకంగా మారింది. గత ఏడాది అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రభావం కూడా సంస్థపై ఇంకా కొనసాగుతోంది.







