ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్, ఆంధ్రప్రదేశ్‌లో తన భారీ ఏఐ హబ్ నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ ఈరోజు, ఏప్రిల్ 28న జరగనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.
సుమారు 15 బిలియన్ డాలర్లు (దాదాపు 1.25 లక్షల కోట్ల రూపాయలు) భారీ పెట్టుబడితో చేపడుతున్న ఈ డేటా సెంటర్ నిర్మాణానికి విశాఖపట్నం సమీపంలో 601.4 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో వేలాది మంది ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ టెక్ హబ్‌గా మారేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. గూగుల్ ప్రతినిధుల తరపున గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ స్వయంగా హాజరై ప్రాజెక్టు పనులను ప్రారంభించనున్నారు. మంత్రి లోకేష్, గూగుల్ ప్రతినిధులతో జరిపిన చర్చలు, ప్రభుత్వం కల్పించిన వేగవంతమైన అనుమతుల నేపథ్యంలో ఈ భారీ పెట్టుబడి రాష్ట్రానికి వచ్చిందని తెలుస్తోంది.
ఈ ఏఐ హబ్ ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా, దక్షిణ భారతదేశం మొత్తానికి డేటా స్టోరేజ్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టు నిర్మాణం వేగంగా పూర్తి చేసి జూలై 2028 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ డేటా సెంటర్, విశాఖ తీరాన్ని ఒక సరికొత్త డిజిటల్ కారిడార్‌గా మార్చనుంది. ఏపీని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలపాలన్న ప్రభుత్వ సంకల్పానికి గూగుల్ వంటి గ్లోబల్ బ్రాండ్ రాక పెద్ద ఊపునిస్తుందని ఐటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. శంకుస్థాపన అనంతరం యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించేందుకు గూగుల్ తన ఇంజనీరింగ్ బృందాలను రంగంలోకి దించింది. నిర్మాణ పనులను అదానీ సంస్థ చేపడుతోంది.











