ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి “అరైవ్ అలైవ్” (Arrive Alive) రహదారి భద్రత కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా స్వీకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కళాభారతిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. బైక్ పై వెళ్లేటప్పుడు డ్రైవర్‌తో పాటు వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, పిల్లలకు కూడా హెల్మెట్ వాడకం ప్రాణ రక్షణకు కీలకమని తెలిపారు. కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం వల్ల ప్రమాదాల తీవ్రత తగ్గుతుందని వివరించారు.
డిఫెన్స్ డ్రైవింగ్ (Defensive Driving) ప్రాముఖ్యతను వివరిస్తూ, ముందుచూపుతో, జాగ్రత్తగా వాహనం నడిపితే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని డీజీపీ పేర్కొన్నారు. “ఇంటి నుండి బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా తిరిగి రావాలి” అనే సందేశంతో “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని, “ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం – సమాజంలో ప్రమాదాలను అరికడదాం” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘన వంటి అంశాలపై ప్రదర్శించిన నాటకాలు, యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాహనం నడిపేటప్పుడు సెల్‌ఫోన్ వాడకం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 300 మందికి హెల్మెట్లు, 161 మంది ట్రక్కు, లారీ డ్రైవర్లకు ఉచిత కళ్లజోడ్లు పంపిణీ చేశారు. ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి భద్రతా చర్యలు చేపట్టడం వల్ల 2025లో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. 50 మందిని రక్షించిన వంకాయల రవిని డీజీపీ చేతుల మీదుగా సన్మానించారు.












