బంజారాహిల్స్లో 'ప్రైడ్ డెయిరీ' పేరుతో నడుస్తున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి బయటపెట్టారు. ఈ ఘటనలో కేంద్రం యజమాని మొహమ్మద్ జునైద్ హుస్సేన్ను అదుపులోకి తీసుకుని, సుమారు ₹18.26 లక్షల విలువైన కల్తీ నెయ్యి, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ కేంద్రంలో తక్కువ నాణ్యత కలిగిన పామ్ ఆయిల్, వనస్పతి మరియు ఇతర పదార్థాలను ఆవు, గేదె మీగడతో కలిపి నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారు. ఈ కల్తీ నెయ్యిని అసలైనదిగా ప్రజలకు, హోటళ్లకు, శుభకార్యాల నిర్వాహకులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
ఈ అక్రమ కార్యకలాపాలపై మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318(4), 274, 275 కింద కేసు నమోదు చేశారు.
ఈ దాడులు అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగాయి. కల్తీ నెయ్యి వ్యాపారంపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

