అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్యకు, ఆమె ప్రియుడికి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్లో 2019లో నమోదైన ఈ కేసులో కుషాయిగూడలోని ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్స్ కోర్టు మంగళవారం (మార్చి 10, 2026) తుది తీర్పును వెలువరించింది.
పోలీసుల కథనం ప్రకారం, కీసర మండలం అహ్మద్గూడకు చెందిన బెరా రేణుక (37)కు, అదే ప్రాంతంలో గ్యాస్ లేబర్‌గా పనిచేసే దేవగాడ కిషోర్ (30)తో అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త బెరా వసంత్ అడ్డుగా ఉన్నాడని భావించి, అతడిని వదిలించుకోవాలని పథకం వేశారు.
2019, మార్చి 13 రాత్రి వసంత్‌కు మద్యం తాగించి, స్పృహ కోల్పోయిన తర్వాత కాళ్లు చేతులు కట్టేసి, చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం అతడు అతిగా మద్యం సేవించి మరణించినట్లు నమ్మించి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
కీసర పోలీసులు శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను పక్కాగా సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో నిందితులు బెరా రేణుక, దేవగాడ కిషోర్‌లను దోషులుగా నిర్ధారిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
నిందితులిద్దరికీ జీవిత ఖైదు శిక్షతో పాటు, ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు ఆదేశించింది. బలమైన సాక్ష్యాధారాలతో శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులను మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ అభినందించారు.

