నల్లగొండ వన్ టౌన్ పోలీసులు ఒక అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు. మహాలక్ష్మి వైన్ షాప్లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడైన కుమ్మరి నర్సింహా రావు (35) ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని వద్ద నుండి రూ.1,77,000 నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
డిసెంబర్ 7, 2025 రాత్రి జరిగిన ఈ దొంగతనంపై షాప్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది.
ఈ రోజు ఉదయం దేవరకొండ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, నిందితుడు నల్లగొండ పట్టణంలోని మూడు వైన్ షాపుల్లో దొంగతనాలు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇతను మూడు దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్ళాడు.
జిల్లా ఎస్పీ నేర రహిత జిల్లా లక్ష్యంతో 'నేను సైతం' కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

