అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన మాట వినడం లేదని, ఇతరులతో చనువుగా ఉంటోందని భార్యను అత్యంత కిరాతకంగా చంపిన ఘటన షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని బైక్‌పై తరలించి పొలాల్లో పడేసిన నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు.
హత్య కు సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏసిపి లక్ష్మీనారాయణ మీడియాకు వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లా వీరన్నపేటకు చెందిన పానుగంటి నర్సింలు (31), అదే ప్రాంతానికి చెందిన శోభ అలియాస్ శోభారాణి (33)ని నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల కుమార్తె మమత ఉంది. శోభకు అంతకుముందే వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు.
కొంతకాలం సజావుగా సాగిన వీరి సంసారంలో నర్సింలు మద్యానికి బానిస కావడంతో గొడవలు మొదలయ్యాయి. వేధింపులు భరించలేక శోభ తన కుమార్తెతో కలిసి రంగారెడ్డిగూడెంలోని తన తల్లి వద్ద నివసిస్తోంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న నర్సింలు, ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పథకం వేశాడు.
ఈ నెల 21న, 'నీ కొడుక్కి సైకిల్ ఇప్పిస్తాను, మహబూబ్‌నగర్‌కు రా' అని నర్సింలు శోభను నమ్మించి పిలిపించాడు. ఆమె తన కుమార్తెతో కలిసి రాగా, తన గదికి తీసుకెళ్లి మద్యం సేవించాడు. అక్కడ మళ్లీ గొడవ జరగడంతో, ముందే సిద్ధం చేసుకున్న గ్రానైట్ రాయితో ఆమె తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా రక్తపు మరకలను శుభ్రం చేశాడు.
అర్ధరాత్రి సమయంలో శోభ మృతదేహాన్ని మూటకట్టి, బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై పెట్టుకున్నాడు. దానిపైనే తన మూడేళ్ల కుమార్తెను కూర్చోబెట్టుకుని, రంగారెడ్డిగూడెం శివారులోని ఓ పొలం గట్టున పడేసి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలను గమనించి, సోమవారం ఉదయం లింగంపల్లిలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి ఒక సెల్ ఫోన్, హత్యకు వాడిన రాయి, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మీడియా కు వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.











