నిజామాబాద్, జూలై 30
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్'ను ప్రామాణిక పత్రంగా పరిగణించరాదని బీజేపీ నాయకులు అదనపు కలెక్టర్‌ను కోరారు. ఈ సర్టిఫికెట్ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని, అక్రమ ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తుందని ఆరోపించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 'ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్'ను ప్రామాణిక పత్రంగా పరిగణించరాదని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి నాయకత్వంలో పార్టీ ప్రతినిధులు గురువారం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా దినేష్ పటేల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జీ.ఓ.ఎం.ఎస్. నెం.172 ద్వారా ఇటీవల ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. రేషన్ కార్డుల ఆధారంగా డిజిటల్ వ్యవస్థను రూపొందించి మీ సేవా కేంద్రాల ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు ప్రకటించడం, అదే సమయంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుండడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
ఈ సర్టిఫికెట్‌ను ఆధారంగా చేసుకొని అక్రమ ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ల నమోదు, సవరణకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని, ఆ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కొత్త పత్రాలను చేర్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు.
ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ భారత పౌరసత్వానికి ఆధార పత్రం కాదని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణలో దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రామాణిక పత్రంగా గుర్తించవద్దని ఎన్నికల అధికారులను కోరారు. నోటిఫికేషన్ వెలువడిన సమయంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నగ్గొల్ల లక్ష్మీనారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్‌కుమార్, చింత శ్రీనివాస్‌రెడ్డి, ఓం సింగ్, విజయ్‌కృష్ణ, వంశీ గౌడ్, మరెడ్డి వనిత, పంచరెడ్డి అనిత, బెల్లాల్ శశాంక్, రమేష్, రాజేశ్వర్‌రెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.











