తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా, కామారెడ్డి జిల్లాలో పలువురు కాంగ్రెస్, బీజేపీ యువకులు టీఆర్పీలో చేరారు.
తీన్మార్ మల్లన్నను కామారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్, బిక్నూర్ మండల అధ్యక్షుడు ఉప్పరి సుధాకర్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతం, గ్రామీణ విస్తరణపై చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టీఆర్పీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, యువత ఆకర్షితులవుతున్నారని నాయకులు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువకులు, బిక్నూర్ మండలానికి చెందిన బీజేపీ యువకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో టీఆర్పీలో చేరారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి టీఆర్పీ చేస్తున్న కృషికి ఆకర్షితులై చేరినట్లు వారు తెలిపారు.
కొత్తగా చేరిన వారికి తీన్మార్ మల్లన్న పార్టీ కండువా కప్పి అభినందనలు తెలిపారు. తెలంగాణలో టీఆర్పీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని నాయకులు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.


