ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను ఈ ఏడాది బహుజన కార్మిక ఐక్యత వారోత్సవాలుగా నిర్వహించాలని బహుజన వామపక్ష కార్మిక సంఘాల సమాఖ్య (బిఎల్ టీయూ) రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సిద్ధిరాములు పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బిఎల్ టీయూ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ, 1886లో చికాగోలో జరిగిన కార్మిక ఉద్యమ స్ఫూర్తిని, భారతదేశంలో కామ్రేడ్ నారాయణ మేఘాజీ లోఖాండే చేసిన కార్మిక సంస్కరణలను గుర్తు చేశారు. బిఎల్ టీయూ దేశీయ, అంతర్జాతీయ కార్మిక హక్కుల కోసం పోరాడుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సిద్ధిరాములు మాట్లాడుతూ, మేడే వారోత్సవాలు మే 1 నుండి 8 వరకు నిర్వహిస్తామని, ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో అమరవీరుల స్ఫూర్తి సభలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మే 2న సిద్దిపేట, మే 3న కామారెడ్డి, మే 10న నిజామాబాద్ లో ప్రత్యేక సభలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.












