కూకట్పల్లి నియోజకవర్గంలో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే నిరుపేదల సమస్యలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన మంగళవారం చర్చించారు. ఇటీవల కొందరు చిరు వ్యాపారులను అధికారులు తొలగించడంతో వారి జీవనోపాధి దెబ్బతిన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, పూలు, పండ్లు అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న వారిని అకస్మాత్తుగా తొలగించడం వారి జీవనానికి తీవ్ర ఆటంకం కలిగిస్తుందని ఎమ్మెల్యే కృష్ణారావు పేర్కొన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి, వారికి తిరిగి వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించేలా అధికారులకు సూచనలు చేయాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా, ఎంతో కాలంగా రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదల పరిస్థితిని కమిషనర్ కు వివరించారు. వారిని అర్ధాంతరంగా రోడ్డుమీదకు నెట్టడం సరైనది కాదని, వారి జీవనోపాధికి గండి కొట్టడం దారుణమని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తికి మున్సిపల్ కమిషనర్ సృజన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవడానికి అధికారులకు సూచనలు చేస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్, శ్యామల రాజు కూడా పాల్గొన్నారు.











