కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఎన్.కె.ఎన్.ఆర్ గార్డెన్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఓట్ల తొలగింపు ప్రక్రియలో అవకతవకలపై కేటీఆర్ ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తుచేశారు. బాలనగర్, జేఎన్టీయూ, కైతలాపూర్ ఫ్లైఓవర్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, నిధుల కేటాయింపులు కూడా ఆగిపోయాయని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తోందని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. గతంలో నెలకు రూ.30 కోట్ల వరకు నిధులు మంజూరు అయ్యేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, దీంతో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా కొనసాగుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, ఎస్.ఐ.ఆర్.కు సంబంధించి ఓట్ల తొలగింపు ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ, ఓటరు నమోదు ప్రక్రియలో అధికారులతో ఎలా వ్యవహరించాలో సూచనలు ఇచ్చారు. గతంలో కూకట్పల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రశంసిస్తూ, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అత్యధిక మెజారిటీతో విజయం సాధించిపెట్టాలని కార్యకర్తలను కోరారు.
కష్టపడే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక 24 గంటల విద్యుత్, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించలేదని, నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









