కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి ఎన్నిక చెల్లదంటూ దాఖలైన ఎలక్షన్ పిటిషన్‌ను జిల్లా కోర్టు విచారణకు స్వీకరించింది. 38వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఉమారాణి ఎన్నికలో నిబంధనలు ఉల్లంఘించారని ఆమె ప్రత్యర్థి రంగ మాధవి ఆరోపించారు.
కామారెడ్డి మున్సిపల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 38వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, కేవలం మూడు ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి ఎన్నికపై ఆమె ప్రత్యర్థి రంగ మాధవి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
రాష్ట్ర ఎన్నికల నియమావళికి విరుద్ధంగా, నిబంధనలను అతిక్రమించి ఎన్నిక జరిగిందని ఆరోపిస్తూ రంగ మాధవి దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్‌ను (కేసు నం. ELEC. OP 1 OF 2026) జిల్లా కోర్టు అడ్మిట్ చేసింది. ఈ పిటిషన్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి CHVRR ప్రసాద్ విచారణకు స్వీకరించినట్లు న్యాయవర్గాలు తెలిపాయి.
ఎన్నికల చట్టం ప్రకారం, కౌన్సిలర్ ఎన్నిక రద్దు అయితే, తదనంతరం చైర్పర్సన్ పదవిపై కూడా ప్రభావం పడే అవకాశముందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉమారాణి కౌన్సిలర్ హోదా చట్టబద్ధతే కీలక అంశంగా మారింది.
ఈ పరిణామం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికార, ప్రతిపక్ష శిబిరాలు పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. కోర్టు విచారణ అనంతరం వచ్చే తీర్పు మున్సిపల్ పాలనలో కీలక మలుపు తిప్పే అవకాశముంది.

