భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బృందావనం బ్రిడ్జి మలుపు వద్ద పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గురువారం సంబంధిత అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి, తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావనం బ్రిడ్జి వద్ద ఇటీవల కాలంలో అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. భారీ వాహనాలతో పాటు ఇతర వాహనాలు ఈ మలుపు వద్ద తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఈ సమస్యపై దృష్టి సారించారు.
గురువారం, ఎస్పీ రోహిత్ రాజు ఆర్&బి అధికారులు, స్థానిక పోలీస్ అధికారులతో కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వాహనదారులు వేగ పరిమితులను పాటించేలా, అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
కొత్తగూడెం నుండి ఖమ్మం వైపు, ఖమ్మం నుండి కొత్తగూడెం వైపు ప్రయాణించే వాహనదారులు ఈ మలుపు వద్ద వేగాన్ని తగ్గించుకునేలా చర్యలు తీసుకుంటామని అధికారులు ఎస్పీకి వివరించారు. దీనికి సంబంధించి అవసరమైన సూచికా బోర్డులు, ఇతర భద్రతా ఏర్పాట్లు పరిశీలించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ, ఆర్&బి ఈఈ నాగేశ్వరరావు, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్సైలు రమణారెడ్డి, ప్రవీణ్, రమాదేవి, ఉమ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.











