ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసిన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛను, జర్నలిస్టుల హక్కులను గౌరవించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
విమర్శనాత్మక వార్తల విషయంలో జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్‌పై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. సదరు జర్నలిస్టుకు సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది.
జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టిలతో కూడిన ధర్మాసనం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం జర్నలిస్టులకు ఉన్న భావ ప్రకటనా స్వేచ్ఛను గుర్తుచేసింది. ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కును అందరూ గౌరవించాలని ధర్మాసనం నొక్కి చెప్పింది.
ప్రభుత్వాలను విమర్శించే వార్తలు రాయడం జర్నలిస్టుల విధి అని, అలాంటి వార్తల విషయంలో క్రిమినల్ కేసుల ద్వారా వారిని అణచివేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. విమర్శలను సహించలేని వాతావరణం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.












