ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కలసి, మత్స్యకారులు మరియు హోంగార్డుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. తీర ప్రాంతాల్లో తమిళనాడు మత్స్యకారుల అక్రమ ప్రవేశాలు, స్థానిక మత్స్యకారులకు కలుగుతున్న ఇబ్బందులు, హోంగార్డుల బదిలీల వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.
తీర ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన మత్స్యకారులు అక్రమంగా ప్రవేశించి, స్థానిక మత్స్యకారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని పీవీఎన్ మాధవ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పీడ్ బోట్లతో వచ్చి మత్స్యసంపదను దోచుకోవడంతో పాటు, స్థానిక మత్స్యకారుల వలలు, పడవలను ధ్వంసం చేయడం, దాడులకు పాల్పడటం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో స్థానిక మత్స్యకారుల్లో భయాందోళనలు నెలకొని, శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని మాధవ్ పేర్కొన్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ప్రాంతంలో ఇలాంటి బోట్లను స్థానికులు పట్టుకున్నప్పటికీ, అధికారుల నుంచి కఠిన చర్యలు తీసుకోకుండా వాటిని విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోందని ఆయన తెలిపారు. అక్రమంగా ప్రవేశించే బోట్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని, తీరప్రాంత భద్రతను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిని మాధవ్ విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, రాష్ట్ర విభజన అనంతరం సుమారు 400 మంది హోంగార్డులు తమ స్వగ్రామాలకు దూరంగా పనిచేస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పరస్పర బదిలీలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా మాధవ్ కోరారు. ఈ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.











