మల్కాజ్‌గిరిలో ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకుంటున్న చిన్న తరహా వ్యాపారుల దుకాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు తొలగించడంపై వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా చేపట్టిన ఈ చర్యతో జీవనోపాధి కోల్పోయామని వారు వాపోయారు.
ఫుట్‌పాత్‌లపై ఉన్న దుకాణాలను అధికారులు, పోలీసులు బుధవారం తొలగించారు. ఈ చర్యతో తాము ఎలా బ్రతకాలో తెలియడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. "మా షాపులు కూల్చేస్తే మేము ఎక్కడకు వెళ్లాలి?" అని ప్రశ్నించారు.
సుమారు 20 రోజుల క్రితం కూడా తమ దుకాణాలకు ఫైన్ రూపంలో రూ.5 వేలు వసూలు చేశారని, అప్పుడు తమ దుకాణాలు ఇక్కడ ఉండకూడదని అధికారులు చెప్పలేదని వ్యాపారులు తెలిపారు. అప్పటికే ఫైన్ కట్టించుకుని ఇప్పుడు ఇలా తొలగించడం తమను తీవ్రంగా నష్టపరిచిందని వారు పేర్కొన్నారు.
తమకు కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండానే దుకాణాలను తొలగించడంపై వ్యాపారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. "మా ప్రాణాలు పోయినా సరే మేము ఇక్కడ నుండి వెళ్ళము" అని కొందరు వ్యాపారులు ఆవేశంగా అన్నారు. ఈ తొలగింపుల నేపథ్యంలో కొందరు వ్యాపారులు అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.
ఈ సంఘటనతో ప్రభావితమైన వ్యాపారులు తమ జీవనోపాధిని ఎలా కాపాడుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.







