భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు తమ ప్రభుత్వానికి మార్గదర్శకమని, దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర అమూల్యమైనదని, ఆయన ఆలోచనలే నేటి ప్రజా పాలనకు పునాది అని అన్నారు. మహాత్మా గాంధీతో పాటు అంబేద్కర్ కూడా దేశానికి రెండు కళ్ల వంటివారని ఆయన అభివర్ణించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అంబేద్కర్ సిద్ధాంతాలు, ఆర్టికల్ 3 కీలకమని, తెలంగాణ ఉద్యమంలో బడుగు బలహీన వర్గాల పాత్రను కొనియాడారు. గద్దర్, అందేశ్రీ వంటి వారి సేవలను స్మరించుకున్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం దళితులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, దళిత బిడ్డ స్పీకర్ గా ఉన్నారని అసెంబ్లీకి రాకుండా అవమానించడం సరికాదని అన్నారు. దళితులు అన్ని మంత్రి పదవులు చేపట్టవచ్చని, వారిని అవమానించేవారిని ప్రతిఘటించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు.
ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామని, కులాల అంతరం తొలగించాలనే అంబేద్కర్ ఆశయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ప్రవేశపెడుతున్నామని, రెండేళ్లలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లలో ఎక్కువ భాగం దళితులు, గిరిజనులకే ఇచ్చామని వివరించారు. 87 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లభించాయని పేర్కొన్నారు.
కొందరు వెనక నుంచి కుట్రలు చేస్తున్నారని, గత పదేళ్ల విధ్వంసాన్ని సరిచేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రజా పాలనను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బీజేపీ కుట్రలు చేస్తోందని, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రో రేటా ప్రకారం సీట్ల పెంపు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని ఆయన అన్నారు.











