ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లో అమర్చిన ఏసీ పేలడంతో చెలరేగిన మంటల్లో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
వివేక్ విహార్‌లోని ఓ భవనంలోని రెండో అంతస్తులో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఏసీ పేలిన వెంటనే మంటలు చెలరేగి, క్షణాల్లోనే మొత్తం ఇంటిని చుట్టుముట్టాయి. ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చేలోపే మంటలు తీవ్రరూపం దాల్చాయి.
మంటల ధాటికి ఇంట్లో ఉన్న తొమ్మిది మంది బయటకు రాలేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 14 ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
సుమారు రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, అప్పటికే భారీ నష్టం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.











