తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత, రాష్ట్రంలో విద్య, వైద్యం ఉచితంగా అందించకుంటే ప్రజలు రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. తాము ప్రకటించిన 'పాంచజన్యం'లో పేర్కొన్న ఐదు కీలక అంశాలను అమలు చేయకుంటే, గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం స్తంభానికి కట్టేసి కొట్టాలని సూచించారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
తన తండ్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను విమర్శించడంపై స్పందిస్తూ, అది కేసీఆర్ ను రాజకీయ నాయకుడిగా మాత్రమేనని, తండ్రిగా కాదని కవిత స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ముందుకే వెళ్తానని, సర్వోదయ తెలంగాణ సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఎవరైతే శత్రువులో, వారే తనకు కూడా శత్రువులని ఆమె పేర్కొన్నారు.
ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన మాట తప్పితే తనను అమరవీరుల స్తూపం వద్ద శిక్షించాలని కవిత అన్నారు. గత 20 ఏళ్లుగా తాను ఇచ్చిన మాట తప్పలేదని, తనను చూస్తూనే ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ప్రజలు విద్య, వైద్యం కోసం తమ ఆదాయంలో 60 శాతం ఖర్చు చేయాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంకల్పిస్తే ఇది సాధ్యమేనని, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఉచిత భోజనం వంటి పథకాలు ప్రారంభించినప్పుడు కూడా ఇలాంటి సందేహాలు వచ్చాయని గుర్తు చేశారు. 'పాంచజన్యం'లోని అంశాలపై ఆర్థిక నిపుణులతో చర్చలు జరిపానని, ప్రభుత్వ ఆదాయంలో లక్ష కోట్ల రూపాయలను ప్రాధాన్యతాంశాలకు కేటాయించవచ్చని ఆమె వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుందని కవిత విమర్శించారు. తల్లిలా ఆలోచిస్తేనే ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం వస్తుందని, ప్రస్తుత ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదని అన్నారు. వెయ్యి రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని, తాము అధికారంలోకి వచ్చాక తల్లిలా పాలన చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ పై తన విమర్శలు కేవలం రాజకీయపరమైనవని, సిద్ధాంతపరమైన విభేదాల వల్లే చేశానని, భవిష్యత్తులోనూ రాజకీయ తప్పిదాలపై విమర్శలు కొనసాగిస్తానని తెలిపారు. కృష్ణా, గోదావరి నీటిని సక్రమంగా వినియోగించుకుంటే రైతుల చేతిలో గణనీయమైన డబ్బు ఉండేదని, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేసినా కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే నీరందించారని విమర్శించారు.











