కామారెడ్డి, 14.07.2026
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులు సైన్స్‌పై అవగాహనతో పాటు పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మంగళవారం రామారెడ్డి మండలంలోని ఉప్పల్వాయి గ్రామంలో పర్యటించి, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.
విద్యార్థులు సైన్స్‌పై అవగాహనతో పాటు పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.
మంగళవారం రామారెడ్డి మండలంలోని ఉప్పల్వాయి గ్రామంలో పర్యటించిన కలెక్టర్, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో 25 మంజూరు కాగా, 10 పూర్తయ్యాయని, మిగిలిన 15 రూఫ్ లెవెల్లో ఉన్నాయని అధికారులు వివరించారు. నిర్మాణాన్ని వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. SIR ప్రక్రియలో 80% పని పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను మరో రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి చేస్తామని మండల తహసీల్దార్ ఉమామలత తెలిపారు.
గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన బోధనపై ఉపాధ్యాయులను అభినందించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తరించాలని సూచించారు. పాఠశాల పరిసరాలకు వచ్చే పక్షుల రాకపోకలు, వాటి ప్రవర్తన, సంఖ్య, జీవన విధానంపై విద్యార్థులు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో 20 రోజులపాటు పరిశీలన నిర్వహించి నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. ఇలాంటి పరిశోధనాత్మక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, పరిశీలనా నైపుణ్యం పెంపొందుతుందని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని 41 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఉన్న పాఠశాలలన్నీ ఈ కార్యక్రమాన్ని ఒక సవాల్‌గా స్వీకరించి అమలు చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్, పీడీ హౌసింగ్ విజయ్‌పాల్ రెడ్డి, మండల తహసీల్దార్ ఉమామలత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












