మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా, మార్కెట్ డిమాండ్ ఉన్న, లాభదాయకమైన పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతులకు సూచించారు. గురువారం పోతిరెడ్డిపల్లి రైతు వేదికలో నిర్వహించిన రైతు వారోత్సవాల అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు.
రైతులు తమ భూములకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే అధిక దిగుబడులతో పాటు మెరుగైన లాభాలు పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ అవసరాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. పంటల సాగుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులపై కూడా దృష్టి పెట్టాలని చెప్పారు.
పీఎం కుసుమ్ కాంపోనెంట్ పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని నిరంతర ఆదాయం పొందేలా ముందుకు రావాలని కలెక్టర్ రైతులకు పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్ సాగు మంచి లాభదాయకమైన పంట అని, దీనికి ప్రభుత్వం 90 శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నందున రైతులు ఈ పంట సాగుపై దృష్టి సారించాలని కోరారు.
వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఏమైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి పంటల వివరాలు, భూమి, బోరు సౌకర్యం వంటి అంశాలపై ఆరా తీశారు. ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు తెలిపిన ఒక రైతుకు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
జహీరాబాద్, సదాశివపేట, వట్పల్లి ప్రాంతాల్లో జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరగా, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల వినియోగంపై అధికారులు ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ సరఫరా, పీఎం కుసుమ్ పథకం, సబ్సిడీలపై అధికారులు అవగాహన కల్పించారు.








